కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: ఒడిశాలో కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక హాస్పిటల్.. తెలంగాణలో ఇద్దరి డాక్టర్లకు వైరస్
ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది.
⍟ దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ బాధితులకు చికిత్స అందజేయడం కోసం ప్రత్యేకంగా హాస్పిటల్‌ను నిర్మించనుంది. మొత్తం 1000 పడకలతో ఈ హాస్పిటల్‌ను నిర్మించాలని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో తొలిసారి ప్రత్యేకంగా కరోనా వైరస్‌కు బాధితుల కోసం నిర్మించే హాస్పిటల్ ఇదే అవుతుంది.
⍟ తెలంగాణలో తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 44కి చేరింది. వీరిలో ఇద్దరు వైద్యులు ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కుత్బుల్లాపూర్‌కి చెందిన వ్యక్తితో పాటు దోమలగూడలో భార్యాభర్తలైన ఇద్దరు వైద్యుల నమూనాలు పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్‌కి చెందిన వ్యక్తి ఇటీవల ఢిల్లీ నుంచి రాగా.. కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఉండటం వల్లే ఆయనకూ పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.దోమలగూడకు చెందిన భార్యభర్తలైన డాక్టర్లకు భార్యకూ వైరస్ సోకింది. మరోవైపు ఇప్పటికే వైరస్ సోకిన వారి నుంచి నమోదైన కేసులు సంఖ్య 9కి చేరింది.
⍟ చైనాలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో కొనసాగుతున్న లాక్‌డౌన్ ఆంక్షలను తొలగించారు. ముఖ్యంగా కోవిడ-19 తొలిసారి వెలుగుచూసిన వుహాన్‌లో పరిస్థితులు చక్కబడుతున్నాయి. నగరం క్రమంగా కోలుకోవడంతో ఆంక్షలను సడలించారు. దీంతో గత రెండు నెలలుగా ఇక్కడ చిక్కుకున్న ఇతర ప్రాంతాలవారు స్వస్థలాలకు వెళ్లేందుకు పయనమయ్యారు. జియాంగ్ నగరంలో ఆంక్షలు సడలించినా బయట ప్రాంతాలకు వెళ్లడానికి కొత్త ఆటంకాలు ఎదురవుతున్నాయి. పూర్తి కథనం..
⍟ కరోనా వైరస్ కట్టిడికి లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... ఆహార, రోజువారీ అవసరాలకు సాయంగా గరీబ్ కల్యాణ్ స్కీమ్ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ రూపొందించినట్లు చెప్పారు. పేద కార్మికులను ఆదుకోవడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టామని వివరించారు. శానిటేషన్ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ప్రత్యేక బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
⍟ కర్ణాటకలో రెండో కరోనా మరణం చోటు చేసుకుంది. బుధవారం కరోనా లక్షణాలతో చనిపోయిన 75 ఏళ్ల వృద్ధురాలి శాంపిళ్లను పరీక్షించగా... ఆమెకు కోవిడ్ సోకినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కర్ణాటక వైద్య విద్య శాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు. చనిపోయిన వృద్ధురాలిది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురం అని తెలుస్తోంది. పూర్తి కథనం..
0 Comments
Enter the comments